Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినీ పరిశ్రమలోను అలానే రాజకీయాలలోను సంచలనంగా మారాడు. వచ్చే ఎలక్షన్స్‌లో ప్రభంజనం సృష్టించాలని ప్లాన్స్ చేస్తున్న పవన్ ఇప్పటికే తాను కమిటైన సినిమా షూటింగ్స్ అన్నింటిని పూర్తి చేస్తున్నాడు. అయితే రేపటి నుండి వారాహి యాత్ర ప్లాన్ చేసిన నేపథ్యంలో మంగళగరిలోనే ఎక్కువగా ఉండనున్నాడు.ఈ క్రమంలో పవన్ ఒప్పుకున్న కొన్ని సినిమాల పరిస్థితి ఏంటనే విషయంపై అందరిలో ఆందోళన నెలకొంది. అయితే జూన్ 12న ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతలు పవన్ కళ్యాణ్‌కి మర్యాద పూర్వకంగా కలిసారు. ఆ సమయంలో సినిమా షూటింగ్‌ల విషయంపై కూడా చర్చించారు.
జనసేన కేంద్ర కార్యాలయంలో యాగశాలను సోమవారం చిత్రసీమ ప్రముఖులు సందర్శించగా, ఆ సమయంలోనే ‘అత్తారింటికి దారేది’ నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఇక యాగశాలను సందర్శించిన ప్రముఖుల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దర్శక నిర్మాతలు హరీష్ శంకర్, రవి శంకర్ ఉన్నారు. ‘ఓజీ’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, ‘బ్రో’ మూవీ సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ‘హరి హర వీరమల్లు’ చిత్ర నిర్మాత ఏఎం రత్నం కూడా ఉన్నారు. అయితే రాజకీయాలతో బిజీ షెడ్యూల్స్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణలకు ఏర్పాట్లు చేసుకోమని పవన్ కళ్యాణ్ చెప్పారట. దీంతో రానున్న రోజులలో విజయవాడ పరిసర ప్రాంతాలలో పవన్ సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమా షూటింగ్‌లు కూడా చేస్తామని హరీష్ శంకర్ అన్నారు.
గతంలో ఏపీ ప్రభుత్వం ఎన్నోసార్లు అక్కడ షూటింగ్ చేసుకోమన్నా కూడా పెద్దగా ఎవరు చేయలేదు. పవన్ కళ్యాణ్ దెబ్బకు ఇప్పుడు ఏపీలో షూటింగ్‌ల సందడి కనిపించనుంది. వారాహి యాత్ర, ఆ తర్వాత రాబోయే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చాలా బిజీ కానున్నారు. ఎక్కువ సమయం జనసేన కేంద్ర కార్యాలయంలో ఉండనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ పెట్టుకోమని చెప్పడంతో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఉదయం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ… రాత్రి వేళల్లో సినిమా చిత్రీకరణలు చేసేలా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోందనే టాక్ నడుస్తుంది.