Adipurush: రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీరామ చంద్రుడిగా ప్రభాస్, జానకీ దేవిగా కృతి సనన్ నటించారు. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్స్ దగ్గర సందడి మాములుగా లేదు. భక్తి పారవశ్యంతో కూడుకున్న చిత్రం కావడంతో ఈ సినిమా చూడాలని థియేటర్స్ దగ్గర టిక్కెట్ కోసం పడిగాపులు కాస్తున్నారు.
ఆరాధ్య దైవం, ఆదర్శ పురుషుడిగా కొలిచే శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడా అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇక థియేటర్స్ దగ్గర అయితే జైశ్రీరామ్ నినాదాలు మారుమ్రోగిపోతున్నాయి. అదే సమయంలో ఆంజనేయ స్వామిపై కూడా భక్తి పారవశ్యం వెల్లివిరుస్తుందనే చెప్పాలి.. ఈ చిత్రంలో హనుమంతుడు పాత్రలో దేవదత్త నాగే అద్భుతంగా నటించారు. అయితే చిత్ర రిలీజ్ కి ముందు మేకర్స్ .. . ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో కూడా ఒక సీట్ ని హనుమంతుడి కోసం కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే. రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని భక్తుల నమ్మకం కాబట్టి ఆదిపురుష్ థియేటర్లో ఆయనకు ఒక సీటు వదలాలని దర్శకుడు ఓం రౌత్ కూడా కోరారు.
వారి కోరినట్టుగా ఇప్పుడు అన్ని థియేటర్స్ లో కూడా ఒక సీట్ ని హనుమాన్ కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఆ సీట్ లో ఆంజనేయస్వామి ఫోటో కూడా పెట్టి థియేటర్స్ లోనే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్స్ లో కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ కొనసాగుతోంది. థియేటర్ యాజమాన్యం తో పాటు ఫ్యాన్స్ కూడా ఆ సీట్లని పూలమాలలతో అలంకరించి పూజలు చేస్తుండడం విశేషం. ఆదిపురుష్ చిత్రం తొలి రోజు వంద కోట్లకి పైగా వసూళ్లు రాబడతాయని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు.