Rajamouli: క్రియేటివ్ డైరెక్టర్స్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్‌ని ఎప్పుడైన తప్పక చిత్రీకరించాలని, ఆ చిత్రంతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచాలని వారు భావిస్తుంటారు. ఆ మధ్య మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించి మంచి విజయం సాధించాడు. ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంపై ఫోకస్ చేస్తున్నాడు. జక్కన్న గతంలో ‘మహాభారతం’ చిత్రాన్ని దృశ్యమానం చేయడం తన జీవితాశయాల్లో ఒకటని చెప్పుకొచ్చాడు. అలాగే మహాభారత కథను పలు భాగాల్లో సంపూర్ణంగా తీయాలంటే కచ్చితంగా పదేళ్ల సమయం పడుతుందని అన్నాడు.
అయితే ఇటీవలి కాలంలో జక్కన్న దీని గురించి ప్రస్తావించిన సందర్భం లేదు. దీంతో ఇది అటకెక్కినట్టే అని అందరు అనుకున్నారు. కాని రీసెంట్‌గా ఈ సినిమా గురించి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. మరో రెండుమూడేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజమౌళి..మహేష్ బాబు సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ తీసే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాతే రాజమౌళి తన కలల సినిమా అయిన ‘మహాభారతం’ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
ఒకవేళ రాజమౌళి మహాభారతం తీస్తే అందులో హీరోలు ఎవరనే చర్చ నడుస్తుంది. తాజాగా రాజమౌళి మహాభారతంలో హీరోలు వీళ్లేనంటూ ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. మహాభారతం చిత్రంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు, అర్జునుడిగా రామ్ చరణ్, కర్ణుడిగా ప్రభాస్, భీముడిగా ఎన్టీఆర్, దుర్యోధనుడిగా రానా, ధర్మరాజుగా పవన్ కళ్యాణ్, భీష్ముడిగా రజనీకాంత్, ద్రోణాచార్యుడిగా అమితాబ్ బచ్చన్, ద్రౌపదిగా దీపికా పదుకొనె నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇంత మంది స్టార్ హీరోలతో రాజమౌళి మహాభారతం ఇస్తే ఆ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం.