ప్రపంచ వ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమల్లో బాగా సక్సెస్ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా వాళ్ళ పిల్లలు సినిమాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండడం చూస్తూ ఉంటాం. అలా ఎంతోమంది సినిమాల్లో ప్రవేశించి మంచి సక్సెస్ కూడా చూశారు. ఉదాహరణకి మన తెలుగు సినిమాలోనే చూసుకుంటే చాలామంది తారల కుమారులు నటులుగా మారి సక్సెస్ అయ్యారు. అవుతూనే ఉన్నారు. వారసత్వం ద్వారా సులభంగా అవకాశం సంపాదించుకుని, సినిమాల్లో అంతే సులభంగా సక్సెస్ చూడగలుగుతున్నారన్న ఆరోపణలతో సంబంధం లేకుండా.. వాళ్ళ శక్తి మేరా ప్రయత్నించి సినీ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ మంచి స్థానం సంపాదించుకుంటున్నారు.
అలా ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్టలు హీరోలుగా మారితే, నాగేశ్వరరావ్ గారి కుమారుడు నాగార్జున పెద్ద హీరో అయ్యాడు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు, చిరంజీవి కొడుకు రామ్ చరణ్, మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మనోజ్ లు, కృష్ణంరాజు సోదరుడి కొడుకు ప్రభాస్ పెద్ద హీరోలుగా మారిన విషయం తెలిసిందే. దర్శకులు, ప్రొడ్యూసర్ లు, సీనియర్ నటుల పిల్లలు కూడా వాళ్ళ తండ్రులకి ఉన్న పేరు ప్రఖ్యాతులతో, సహకారంతో సినిమాల్లోకి వస్తుంటారు. కేవలం అగ్రనటుల పిల్లలు మాత్రమే కాకుండా కొంతమంది హాస్య నటుల పిల్లలు కూడా సినీ హీరోలుగా మారి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. పాపులర్ హాస్య నటులు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ కొడుకులు కూడా హీరోలుగా నటించి, హీరోలుగా తెరమీద కనిపించే అదృష్టం తమకి ఉందని నిరూపించుకోవడం చూశాం. కానీ ఒక హాస్య నటుడి కొడుకు విషయంలో అలా జరగలేదు. ఎలాగో చూద్దాం.
రాజేంద్రప్రసాద్. తెలుగు సినీ అభిమానులకి పరిచయం అక్కర్లేని వ్యక్తి. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అనేక సినిమాల్లో నటించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. హాస్య నటుడిగా మారి, ఆ తర్వాత అదే హాస్యాన్ని చూపిస్తూ హీరోగా కూడా నటించారు. అప్పట్లో ఇలా హాస్యం పండిస్తూనే హీరోలుగా చేస్తున్న కొద్ది మందిలో ఆయన ఒకడు కావడం ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది. కానీ, ఆయనకి అదే పనిగా అవకాశాలు వచ్చిందేమీ లేదు. కొంతకాలం ఆయన సినిమాకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఆ వయసుకి తగినట్టే పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో నెట్టుకువస్తున్నారు. ఇదే సమయంలో, రాజేంద్ర ప్రసాద్ గారు పలువురు ప్రముఖుల పిల్లల లాగే ఆయన కూడా తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించారు.
తన పోలికలతోనే కనిపిస్తూ, చూడటానికి మరో రాజేంద్రప్రసాద్ లా ఉండే కొడుకుని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని భావించారు. ఆ ఆలోచనతోనే తన కొడుకైన బాలాజీ ప్రసాద్ ని సినిమాల్లోకి తీసుకురావాలి అనుకున్నారు. అందుకోసం తనకు తెలిసిన సినీ పెద్దలని సంప్రదించి ఎట్టకేలకు ప్రముఖ మీడియా అధినేత రామోజీరావు గారి నిర్మాణంలో ఒక సినిమాని అనుకున్నారు. అనుకున్నట్టే మొదలయిన ఆ సినిమా దాదాపు 40 శాతం పూర్తి చేస్కున్న తర్వాత అనుకోని కారణాల వల్ల ఉన్నట్టుండి ఆగిపోయింది. అలా జరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాలాజీ ప్రసాద్ ఇక సినిమాలు తనకి అచ్చిరావని భావించాడు. అంతే. ఇక మళ్ళీ ఆయన సినిమాల వైపు చూడలేదు. నటించాలనుకున్న ఆయన ప్రయత్నాలన్నిటినీ విరమించుకున్నాడు.
ఇక రాజేంద్ర ప్రసాద్ గారు కూడా తన కొడుకు నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఎన్నో సినిమాలు చేసి, తనకంటూ ప్రత్యేకమైన అభిమానులని సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కుమారుడిని ఇతరుల లాగే సినిమాల్లోకి తీసుకురాలేకపోయానని అనుకుంటూ ఉంటారట. ఒక సినిమా పోతే పోయింది.. మళ్ళీ ఇంకో సినిమా చేయమని చెప్పే ప్రయత్నం చేసినా బాలాజీ తన మాట వినకపోవడం ఆయన్ని కాస్త నిరాశకు గురి చేసిందని చెప్తుంటారు. 2017 లో పెళ్లి చేసుకున్న ఆయన కుమారుడు ప్రస్తుతం విదేశాలకు ఎగుమతులు చేసే బిజినెస్ లో పని చేస్తున్నాడు. సినిమాల్లోకి వచ్చి ఉంటే ఎంత పేరు సంపాదించేవాడో, అంతే పేరు తన వృత్తిలో సంపాదించాలని రాజేంద్ర ప్రసాద్ కోరుకుంటున్నట్లు తెలిపారు.
Leave a comment