Keeravani: ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ అందుకున్న కీరవాణి తన మ్యూజిక్‌తో సంగీత ప్రియులని ఎంత మెస్మరైజ్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి మ్యూజిక్‌కి మైమరచిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆయస సంగీతానికి ఆస్కార్ సహా ఎన్నో అంతర్జాతీయ అవార్డులు ఆయనకు దాసోహం అయ్యాయి. ప్రస్తుతం ఆయన ‘హరి హర వీరమల్లు, చంద్రముఖి 2’ చిత్రాలకు సంగీతం అందిస్తుండగా, హరి హర వీరమల్లు షూటింగ్ నత్తనడక సాగుతుంది. ఇక లారెన్స్, కంగనా రనౌత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ‘చంద్రముఖి 2’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఇప్పుడు ఈ చిత్రం రీరికార్డింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలోని పాత్రలకు ప్రాణం పోసేందుకు కీరవాణి ఎంత కష్టపడ్డాడో తాజాగా వివరించాడు.
చంద్రముఖి 2 సినిమాలోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తాయి. చిత్రంలోని మైండ్‌బ్లోయింగ్ సీన్లకు నా మ్యూజిక్‌తో ప్రాణం పోసేందుకు 2 నెలలు నిద్రలేని రాత్రులు, పగళ్లు గడిపాను. గురుకిరణ్, మిత్రుడు విద్యాసాగర్.. నాకు జయం కలగాలని కోరుకోండి అని కీరవాణి తన ట్వీట్లో తెలియజేశారు. అంటే చంద్రముఖి 2 కోసం కీరవాణి రెండు నెలలపాటు చాలా కష్టపడ్డారని ఈ ట్వీట్‌తో అర్ధమవుతుంది. కీరవాణి తన ట్వీట్లో ప్రత్యేకంగా గురు కిరణ్, విద్యాసాగర్ పేర్లను ప్రస్తావించడం వెనక ఒక కారణం ఉంది.
అది ఏంటంటే.. రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సంగీతం అందించింది విద్యా సాగర్ కాగా, అదే నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘నాగవల్లి’ సినిమాకు గురు కిరణ్ మ్యూజిక్ ఇచ్చారు. అంటే తన కంటే ముందుగా ఈ జోనర్ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం వల్లే కీరవాణి తన ట్వీట్లో వారిద్దరినీ గుర్తు చేసుకున్నట్టు అర్ధమవుతుంది. సెప్టెంబర్ 19న చంద్రముఖి 2 చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. చంద్రముఖిలో రజనీకాంత్ అలరించగా, ఇప్పుడు లారెన్స్ చంద్రముఖి2 తో ఎంత మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇందులో పి వాసు. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్ చేయగా, రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు కీలక పాత్రలు పోషించారు.