ఒకప్పుడు సౌత్ సినిమా అభిమానులని ఎంతగానో ఆకర్షించిన కథానాయిక సౌందర్య. చాలా చిన్న వయసులో, అంటే కేవలం 31 ఏళ్లు ఉండగానే ప్రమాదవశాత్తూ తన ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే 17 ఏళ్లు గడిచిపోయాయి. సినిమాల్లో పనిచేసినంత కాలం అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా నటించి 100 సినిమాలు పూర్తి చేసిన వ్యక్తుల జాబితాలో చేరింది. తన బ్రదర్ తో పాటు హెలీకాప్టర్ చనిపోవడం అప్పట్లో అందరినీ నెలల తరబడి నమ్మలేకుండా చేసింది. ఆమె గతించిన సమయానికి తన కెరీర్ మంచి పీక్స్ లో ఉంది. ఆమె పేరుని గుర్తు చేసుకోగానే చాలామందికి ఒక అందమైన రూపం మనసులోకి వచ్చేస్తుంది. ఎక్సపోజింగ్ కి దూరంగా ఉంటూనే స్టార్ హీరోయిన్ గా మారిన సౌందర్య ఎంతో ప్రత్యేకం. నటిగా మాత్రమే కాకుండా, తన ఫేమ్ ద్వారా సంపాదించుకున్న డబ్బుతో ఎన్నో మంచి పనులు కూడా చేసింది. స్కూల్స్ కట్టించడం, విరాళాలు ఇవ్వడం మొదలయిన పనులెన్నో ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు కారణం ఆమె కుటుంబం. సౌందర్య చనిపోయినా ఆమె ఆశయాలు బ్రతికే ఉండాలని ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
కానీ, సినీ జీవితంలో ఉన్నత శిఖరాలని చూసిన సౌందర్య తన మిగతా జీవితానికి సంబంధించి ఎన్నో మిస్ అయిందనే చెప్పాలి. తనలో తనకే జీవితం అంటే ఇలా ఉండాలి అనే ఆలోచనలు బాగా ఉండేవట. వాటిని తనకి బాగా దగ్గరైన వ్యక్తులతో పంచుకోడానికి ఆసక్తి చూపించేదట. తనకి నచ్చినట్టు జీవితాన్ని మల్చుకోవాలి అనుకున్న సమయానికి చావు తనని పలకరించడం తన అభిమానుల మనసుని ఎప్పటికీ కలిచివేసే విషయం. ముఖ్యంగా సౌందర్య ఎంతో ఇష్టపడి సొంతం చేసుకున్న విషయాల్లో ఒక బంగ్లా కూడా ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి ఒక కారణం ఉంది. ఆమె టైమ్ లోనే తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన మరో నటి ఆమని. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమని సౌందర్యతో ఉన్న స్నేహం గురించి, ఆమెతో తన అనుభవాల గురించి ప్రస్తావించారు. ఇప్పుడవేంటో తెలుసుకుందాం.
తనకి నచ్చినట్టు జీవించడం కోసం సౌందర్య ఒక బంగ్లా కొనుక్కుంది. ఆ బంగళా తనకి ఎంతో ఇష్టమైందిగా గుర్తుచేసింది ఆమని. ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా బ్రతకాలని కలలు కన్నట్టు చెప్పింది. స్వయంగా ఆమెకి మంచి స్నేహితురాలు కావడంతో ఎన్నో వ్యక్తిగత ఇష్టాయిష్టాలని తనతో పంచుకునేదని అంది. అలా మాట్లాడుకునే సందర్భాల్లోనే ఇలా బంగ్లా ప్రస్తావన కూడా వచ్చేదని తెలియజేసింది. సౌందర్య చనిపోయిన సమయానికి తనకి పెళ్ళయి కేవలం ఏడాది మాత్రమే అయింది. అప్పటికి తనకి పిల్లలు లేరు. కానీ, సౌందర్య చనిపోయే సమయానికి తను ప్రెగ్నెంట్ అన్న వార్తలో నిజం లేదని చెప్పింది ఆమని. ఆమెతో పాటే ఆమె సోదరుడు అమర్ కూడా ఆ హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో చట్టబద్ధంగా ఆమె ఆస్తులపై అతని కొడుకులకే హక్కు దొరికింది అని ఆమె చెప్పింది. ఐతే, చాలా కాలం తర్వాత ఆ మధ్య ఒకసారి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ కనిపించలేదని, ఒక పాడుబడిపోయిన బంగ్లాలాగా మారిపోయిందని చెప్పింది ఆమని.
Leave a comment