జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అందరినీ తమ స్కిట్స్ ద్వారా నవ్వించే ఈ షో లో చాలా మంది ఆర్టిస్ట్స్ గా మారాలి అనుకునే వాళ్ళకి తమని తాము పరిచయం చేసుకునేందుకు ఒక వేదిక అయ్యింది. ఇప్పటిదాకా ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుని తర్వాత సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సుడిగాలి సుధీర్ ఇక్కడ వచ్చిన ఫాలోయింగ్ తో ఏకంగా హీరోగా ఒక సినిమానే తీశాడు. యాంకర్ గా కూడా చేస్తున్నాడు. అదే కోవకి చెందిన వాడు ఈ షోలో భాస్కర్ టీం లో చేసే నరేష్.
నరేష్ అనగానే అతనిలో అందరూ చూసే మొదటి విషయం అతని హైట్. చాలా పొట్టిగా ఉండే నరేష్ అలా ఎత్తు పెరగకుండా ఉండడానికి కారణం అతనిలో ఎదుగుదలకి సంబంధించిన భాగాలు సరిగా పనిచేయకపోవడం. అందరిలా అతను కూడా ఎత్తు పెరగాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయించుకోవాలట. అలా గనక చేయకపోతే ఇక ఎప్పటికీ అలాగే ఉండిపోతాడట. పొట్టిగా ఉండటం వల్ల అతని వయసు కూడా చాలా తక్కువ అని అందరూ అనుకుంటారు. కానీ, నిజానికి నరేష్ మరీ చిన్నపిల్లాడు ఏమీ కాడు. అతనికి ఇప్పుడు 21 ఏళ్ళు ఉన్నాయి. 2000 సంవత్సరంలో పుట్టిన నరేష్ కి ఈ ఫీల్డ్ వైపు రావడానికి ఒక బలమైన కారణం ఉంది.
అదే అతనికి డాన్స్ అంటే బాగా నచ్చడం. చిన్నప్పటినుంచే ఎలాగైనా డాన్సర్ అవ్వాలి అన్న అతని కోరిక హైదరాబాద్ దాకా తీసుకుని వచ్చింది. మొదట్లో ఈటీవీలో వచ్చే ‘ఢీ’ షో లో అవకాశం కోసం ప్రయత్నించాడు. తను అనుకున్నట్లే అందులో సెలెక్ట్ కూడా అయ్యాడు. ఇక అప్పటినుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎక్కడో వరంగల్ లో జనగామ దగ్గర విలేజ్ లో పుట్టిన అతనికి మెల్లగా నటనలో కూడా ఆసక్తి మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఎక్కువ నిలబడేవాడట. అలా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు సునామీ సుధాకర్ కంట పడటంతో అతను తీసుకొచ్చి చలాకీ చంటి టీం లో జాయిన్ చేసాడట. ఆ తర్వాత కొంత కాలానికి బుల్లెట్ భాస్కర్ టీం లో చేరిన నరేష్ తన టాలెంట్ ని చక్కగా ప్రూవ్ చేసుకున్నాడు.
వయసులో చిన్నవాడైనా అతని తెలివి తేటలతో, మంచి కామెడీ టైమింగ్ తో గుర్తింపు సంపాదించాడు. పెద్దగా ప్రాక్టీస్ చేయకుండానే.. నేరుగా షో లో నటించి మార్కులు కొట్టేస్తాడని నరేష్ కి పేరు. ఈ విషయాన్ని అతని టీం లీడర్ బుల్లెట్ భాస్కర్ చాలా సార్లు ప్రస్తావించాడు. ఐతే, ఎంతో పేదరికం నుంచి వచ్చిన నరేష్.. ఈ షోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్వంత ఊరులో ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఏ ఎదుగుదల ఐతే అతనికి బలహీనత అయిందో.. అదే ఎదుగుదల లోపం అతన్ని జీవితంలో ఎదిగేలా చేసింది అన్నమాట. నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ నరేష్. అతను సినీ రంగంలో మరింత అభివృద్ది చూడాలని ఆశిద్దాం.
Leave a comment