విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సుదీర్ఘ ఫిల్మ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో అడవి రాముడు మొదటి స్థానంలో ఉంటుంది. అడవి రాముడు సినిమాతోనే ఎన్టీఆర్ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. అడవి రాముడు మాత్రం మరొక ఎత్తు. ఈ చిత్రం ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఎన్నో రికార్డులను సృష్టించింది. అటువంటి సినిమా గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి. శతాధిక చిత్రాల దర్శకుడు కె రాఘవేంద్రరావు, నందమూరి తారక రామారావు గారి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం అడవి రాముడు. కన్నడలో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో రాజ్ కుమార్ తీసిన గంధడ గుడి చిత్రం 1972లో విడుదలై ఘన విజయం సాధించింది.
దాంతో ఎన్టీఆర్ గారు ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో ఓ సినిమా చేయాలని భావించారు. ఇదే విషయాన్ని అప్పటికే తాను డేట్స్ ఇచ్చి ఉన్న సత్యచిత్ర బ్యానర్ నిర్మాతలు నెక్కంటి వీర వెంకట సత్యనారాయణ మరియు ఆరుమిల్లి సూర్యనారాయణలకు చెప్పారు. వారు జంధ్యాలగారిని సంప్రదించి గంధడ గుడి ఆధారంగా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ రెడీ చేయమని సూచించారు. అలాగే సత్యచిత్ర బ్యానర్ లో వచ్చిన తహశీల్దార్ గారి అమ్మాయి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కె రాఘవేంద్రరావు గారు.. అప్పుడప్పుడే డైరెక్టర్ గా ఎదుగుతున్నారు. ఆయన పనితనం తెలిసిన వెంకట సత్యనారాయణ, సూర్యనారాయణలు తమ బ్యానర్ లో ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ ఆఫర్ వచ్చినప్పుడు రాఘవేంద్రరావు గారు మొదట చాలా భయపడ్డారు. ఆరు కోట్లమంది ఆంధ్రుల హృదయాల్లో అభిమానాన్ని సంపాధించుకున్న కథానాయకుడిని తెరపై ఎలా ప్రజెంట్ చేయాలని ఎంతో కంగారు పడ్డారు. అలా అని వెనకడుగు వేయలేదు.
అడవి రాములు పనులు ప్రారంభించారు. సిరిసిరిమువ్వ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన జయప్రదను హీరోయిన్ గా తీసుకున్నారు. అప్పటికే తన సినిమాల్లో పనిచేసిన జయసుధను ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేశారు. నాగభూషణం, సత్యనారాయణ, గుమ్మడి, జగ్గయ్య, రాజాబాబు, శ్రీధర్ తదితరులను ఇతర కీలక పాత్రల కోసం తీసుకున్నారు. ప్రీ పొడెక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని 1977 జనవరి 9న మద్రాసులోని స్టూడియోలో అడవి రాముడు రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. ఓపెనింగ్ షాట్ మినహా సినిమా చిత్రీకరణ మొత్తం కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ముదుమలై అడవుల్లోనే జరిగింది. ఎన్టీఆర్ గారు తన సినీ కెరీర్లో మొదటిసారి మద్రాస్ దాటి 30 రోజులు పైగా షూటింగ్ చేసింది ఈ సినిమాకే కావడం విశేషం. అలాగే సినిమాస్కోప్‌లో చిత్రీకరించిన ఎన్టీఆర్ తొలి కలర్ సినిమా ఇదే. అడవి రాముడు కోసం సినిమాస్కోప్ కి వాడే లెన్స్ ని ప్రసాద్ ల్యాబ్స్ వారు జపాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. షూటింగ్ సమయంలో మదుమలై అడవిలో కేవలం మూడు ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు మాత్రమే ఉండటంతో.. 350 యూనిట్ సభ్యుల కోసం ప్రత్యేకంగా కాటేజీలు ఏర్పాటు చేశారు. మద్రాసు చిత్ర సర్కస్ కంపెనీ నుంచి దేవకి, లిజి, సుజి అనే మూడు ఏనుగులను అడివికి తీసుకెళ్లారు. ఈ సినిమా షూటింగ్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. షూటింగ్ సమయంలో కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. జయసుధ మరియు జయప్రదతో సహా పలువురు యూనిట్ సభ్యులకు గాయాలు అయ్యాయి. ఫైనల్ గా షూటింగ్ ను కంప్లీట్ చేశారు.
కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. సాహిత్యం వేటూరి రాయగా.. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల చేత పాటలన్నీ పాడించారు. 1977 ఏప్రిల్ 28న అడవి రాముడు సినిమాను 40 ప్రింట్స్‌తో విడుదల చేశారు. తొలి ఆట నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. అప్పటి వరకు ఉన్న ఎన్టీఆర్ గారి ఇమేజ్ ని అడవి రాముడు పూర్తిగా మార్చేసింది. ఆయన ఆహార్యం, దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త ఎన్టీఆర్ ను తెరపై చూపించారు. అలాగే కమ్యూనిజానికి కమర్షియల్ హంగులు అద్ది ఒక కొత్త కమర్షియల్ ఫార్ములా సృష్టించారు. ఇక ఎన్టీఆర్ కు రిటైరే అని అనుకున్నవారంతా అడవి రాముడు చూసి ముక్కున వేలేసుకున్నారు. అలాగే సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఆరేసుకోబోయి పారేసుకున్నాను సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా 50 రోజుల్లో రూ. 83 లక్షలు, 67 రోజుల్లో రూ. 1 కోటి కలెక్ట్ చేసిన మొదటి చిత్రంగా అడవి రాముడు రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ రూ. 3 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, మరియు 8 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 200 రోజులు నడిచిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే ఈ చిత్రం విజయవాడలోని అప్సర థియేటర్లో 302 రోజులు ప్రదర్శింపబడింది. నాలుగు సెంటర్లలో 365 రోజులు రన్ అయ్యింది. అప్పట్లో షోలో సినిమా ఒకే రాష్ట్రంలో 3 కేంద్రాల్లో గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం రికార్డుగా చెప్పుకొన్నారు. అయితే ఆ రికార్డును అడవి రాముడు బీట్ చేసి పడేసింది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. థియేటర్స్‌లో తెరపైకి కాయిన్స్ విసరడం అడవి రాముడు సినిమాతోనే మొదలైంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అడవి రాముడు సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్.
ఇకపోతే అడవి రాముడు విషయంలో జయసుధగారు మోసపోయారు. నిజానికి ఈ చిత్రంలో తానే హీరోయిన్ అని జయసుధ అనుకున్నారు. చివరి నిమిషం వరకు తాను సెకండ్ రోల్ చేస్తున్నాననే విషయం జయసుధకు తెలియలేదు. రాఘవేంద్రరావు గారు కూడా చెప్పకుండా దాచి ఉంచి ఒక రకంగా మోసం చేశారు. విషయం తెలిశాక సినిమా నుంచి తప్పుకునే పరిస్థితి లేక ఆమె ముందుకు సాగారు. ఇక అడవి రాముడు విడుదల అయ్యాక జయసుధకు అభిమానులు నుంచి ఎన్నో లేఖలు వచ్చాయి. సినిమాలో మంచి పాత్ర అయినప్పటికీ.. టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న జయసుధ సెకండ్ హీరోయిన్ రోల్ ను పోషించడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. దాంతో ఆ క్షణమే జయసుధ తదుపరి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని నిర్ణయించుకున్నారు.