Suman: 80,90ల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరో సుమన్. అప్పట్లో మంచి క్రేజ్ ఉన్న సుమన్ ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఇటీవల ఆయన పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక రీసెంట్గా ఓ కార్యక్రమంలో తన తల్లి గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన తల్లే అని చెప్పారు సుమన్. తన తల్లి లెక్చరర్ ఎతిరాజ్ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేసి ఆ తర్వాత ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారు. అయితే నాకు మంచి చదువు చెప్పించాలని దివంగత ముఖ్యమంత్రి జయలలిత, మాజీ మంత్రి చిదంబరం లాంటి గొప్పవాళ్లు చదువుకున్న చర్చ్ పార్క్ కాన్వెంట్లో చేర్పించింది.
11 ఏళ్ల వయసున్నప్పుడు నన్ను మా ఇంటి దగ్గరలోనే ఒక కరాటే స్కూల్లో చేర్పించారు. భగవద్గీత కూడా నేర్పించారు. ఇవి ఎందుకు నాకు అనుకునే వాడిని. కాకపోతే అవి రెండు అలవాటైపోయాయి. నా కెరీర్‌కు కూడా చాలా ఉపయోగపడ్డాయి అని సుమన్ అన్నారు. తన తల్లి ఎప్పుడు బిజీగా ఉండేవారని.. అయిన కూడా తన కోసం రోజూ పూజలు చేసేవారని సుమన్ వెల్లడించారు. ‘ఒకవైపు కాలేజ్, మరోవైపు ఇల్లు, మరోవైపు కుటుంబం.. ఇన్ని బాధ్యతలు చూసుకుంటూనే తన కోసం ప్రత్యేకమైన సమయం కేటాయించే వారట సుమన్ తల్లి.
ఇక అప్పట్లో మా అమ్మ డబ్బులు తీసుకోకుండా చాలా మందికి ట్యూషన్ చెప్పేవారు. ఒక కార్పెంటర్ కూతురు, ఎలక్ట్రిషియన్ కూతురు, ఇంజనీర్ డ్రైవర్ కూతురు.. ఇలా ఒక ఐదుగురికి ట్యూషన్ చెప్పేవారు. వారితో పాటు మరో బ్యాచ్‌లో సినిమా ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు పద్మావతి, శోభన్ బాబు గారి కూతురు మృదుల, తమిళ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చేవారని సుమన్ తెలియజేశారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై గారిని కలవడానికి వెళ్తే.. నేను మీ మదర్ స్టూడెంట్ అని ఆమె నాకు చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఆ మధ్య చెప్పారు.. సుమన్ గారికే తెలీదండి మా అమ్మ ఆయన తల్లి దగ్గర చదువుకున్న విషయం అని.. ఇలా ఎందరో మా అమ్మ దగ్గర చదువుకున్నారని సుమన్ స్పష్టం చేశారు.