సీనియర్ తెలుగు నటీమణుల్లో ప్రముఖులు నటి శారద గారు. ఆమె అసలు పేరు సరస్వతీ దేవి. అప్పటికే పరిశ్రమలో చాలామంది సరస్వతి అనే పేరు ఉండడంతో ఆమె తన పేరుని శారదగా మార్చుకున్నారు. ఇక అదే తన స్టేజ్ నేమ్ గా మారిపోయింది. ఐతే, తెనాలిలో పుట్టిన ఆమె ఇటు తెలుగు సినిమాల్లో నటిగా రాణించడమే కాకుండా.. మలయాళ చిత్ర పరిశ్రమకి వెళ్ళి అక్కడ కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడి భాష నేర్చుకుని.. ఆ నేటివిటీకి తగ్గట్టు అభినయం నేర్చుకుని వాళ్ళని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు.
1959 లో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన శారద ఎల్వీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నటన నేర్చుకున్నారు. నవరసాలు పలికించడంలో ప్రావీణ్యం సంపాదించిన ఆమె ‘కన్యాశుల్కం’ అనే తెలుగు సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించి తన కెరీర్ స్టార్ట్ చేశారు. నిజానికి అంతకుముందే థియేటర్ లో నాటకాలు వేస్తూ ఉండే శారద గారి నటనా అనుభవం కూడా తోడైంది. మొదటి సారి నాగేశ్వర రావ్ గారి సరసన చేసిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో తమిళ, మలయాళ సినిమాల నుంచి కూడా ఆఫర్లు రావడం మొదలైంది.
మరో ఐదు సంవత్సరాలలో ఆమె స్థాయి మరీ పెరిగిపోయింది. 1965 నుండి శకుంతల, మురప్పెన్ను, ఉద్యోగస్త వంటి సినిమాలు చేసిన తర్వాత మలయాళంలో ఆమెకి ఎంతోమంది అభిమానులు తయారయ్యారు. ప్రత్యేకంగా కొన్ని రకాల పాత్రలని ఆమె తప్ప మరెవ్వరూ చేయలేరు అనిపించుకుని మంచి డిమాండ్ సంపాదించకున్నారు. అలా అక్కడి చిత్ర పరిశ్రమల్లోనే పనిచేస్తూ.. 1967 లో మొదటిసారి జాతీయ స్థాయిలో ఒక honorary award రావడం జరిగింది. అప్పటికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఇవ్వడం అనేది లేదు. 1967 లో ఉత్తమ నటికి కూడా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ని ఇవ్వడం మొదలెట్టారు.
అలా 1968 లో మొదటిసారి ‘తులాభారం’ సినిమాకు గాను శారద గారు ఉత్తమ నటిగా మొదటి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తర్వాత మరో మూడేళ్ళ తర్వాత ‘స్వయంవరం’ సినిమాలో సీత పాత్రకి మరో నేషనల్ అవార్డ్ ఆమెని వరించింది. ఈ రెండు సార్లు కూడా ఆమెకి మలయాళ పరిశ్రమ నుండి వచ్చాయి అవార్డులు. ఐతే, శారద గారు తెలుగు వారిగా 1978 లో నిమజ్జనం అనే తెలుగు సినిమాకి కూడా ఉత్తమ జాతీయ నటిగా మరో అవార్డ్ తీసుకున్నారు. ఆమె తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ గెలుచుకున్నది అర్చన (దాసి 1987), విజయశాంతి (కర్తవ్యం 1990), కీర్తి సురేష్ (మహానటి 2018) ఈ ముగ్గురు మాత్రమే. కానీ, నటుల విభాగంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పటివరకు ఒక్కరు కూడా జాతీయ అవార్డ్ తీసుకోకపోవడం గమనించాల్సిన విషయం!
Leave a comment