Tollywood: పాండమిక్ నుండి ఓటీటలకి ఊహించని విధంగా డిమాండ్ ఏర్పడింది. పరిస్థితులు చక్కబడ్డా ఎలాగో రెండు, మూడు వారాలాగితే ఎంచక్కా ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లో సినిమా చూసెయ్యొచ్చు.. అంతంత రేట్లు పెట్టి, అదనపు ఖర్చులు భరించి థియేటర్లకు వెళ్లే అవసరం ఏముంది అనే ఆలోచన ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.
బడ్జెట్ పెరిగిపోవడం, పెద్ద సినిమాలకు రెండు వారాల వరకూ టికెట్ రేట్లు పెంచడం, ఎప్పటిలానే చిన్న చూపుకు గురైన చిన్న సినిమాలు ఓటీటీలను ఆశ్రయించడం, ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదలవడం.. ఇలా పలు కారణాలున్నాయి. మరో పక్క ఆగస్టు 1 నుండి షూటింగ్స్ నిలిచిపోనున్నాయనే వార్తలతో సినిమా పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో, సినిమా రంగంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిన టికెట్, ఓటీటీ వంటి విషయాల గురించి చర్చించేందుకు సోమవారం నిర్మాతల మండలిలో తెలుగు చలనచిత్ర నిర్మాతలంతా సమావేశమయ్యారు. ఓటీటీలో రిలీజ్ విధానంతో పాటు చిన్న మరియు పెద్ద సినిమాల టికెట్ రేట్ల విషయంలో కీలక ప్రకటనలు విడుదల చేశారు.
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న సినిమాలకు ఏ, బీ సెంటర్లలో 100, 125 రూపాయలు.. సి సెంటర్లలో 70 నుండి 125 రూపాల చొప్పున.. మధ్య తరహా సినిమాలకు ఏ, బీ సెంటర్లలో 112 మరియు 177 రూపాయల చొప్పున, సి సెంటర్లలో 100, 177 రూపాయల చొప్పున ధరలు నిర్ణయించారు. పెద్ద సినిమాలకు ఏ, బీ సెంటర్లలో 177, 295.. సి సెంటర్లలో 150, 295 నిర్దేశించనున్నట్లు చెప్పారు.
ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. 6 కోట్ల బడ్జెట్ లోపు సినిమాలు నాలుగు వారాల తర్వాత.. భారీ బడ్జెట్ సినిమాలు 10 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 1 నుండి కొత్తగా నిర్ణయించిన అంశాలు పరిగణలోకి రానున్నట్లు నిర్మాతలు తెలియజేశారు
Leave a comment