సినీ ప్రపంచం పైకి ఎంత అందంగా కనబడుతుందో.. లోపల ఎన్నో జీర్ణించుకోలేని విషయాలతో కూడా నిండి ఉంటుంది. టాలెంట్ ఉన్నవాళ్ళని కాకుండా పెద్దింటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం, ఒకరు చేసిన మరొకరు లాక్కొవడం, ఇవ్వాల్సినంత క్రెడిట్ గానీ, డబ్బులు గానీ ఇవ్వకపోవడం, పూర్తిగా మనీ మైండెడ్ నేచర్ తో కళని సమాధి చేయడం వంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఐతే, అందరూ వీటన్నిటినీ అధిగమించి పైకి రాలేకపోవచ్చు. కొందరు ఎంతో డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. జీవితంతో పోరాడలేక ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. అలా జీవితాన్ని ముగించుకున్న ఒకవ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఆయన పేరు రంగనాథ్. ఎలాంటి సినీ నేపథ్యంలేని కుటుంబంలో పుట్టి.. తన కుటుంబాన్ని పోషించుకుంటూనే.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అగ్ర హీరో అయిన నాగేశ్వర రావ్ గారి నటనని చూసి ఎంతో అబ్బురపడిన ఆయన స్వయంగా నటన మీద ఆసక్తి పెంచుకున్నారు. పుట్టింది మద్రాస్ లోనే అవడంతో ఆయనకి సినిమా వాళ్ళని కలిసి అవకాశాల కోసం ప్రయత్నించడం కూడా పెద్దగా కష్టంగా అనిపించలేదు. అలా ఒక సమయంలో ఆయన ఒక పెద్ద హీరోగా మారే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కానీ, ఆర్థిక పరిస్తితులు ఆయన్ని పూర్తిగా సినిమాల మీదనే దృష్టి నిలిపేలా చేయలేదు. బాధ్యతలు నెత్తిన పడడంతో.. కుటుంబాన్ని పోషించడం కోసం వేరొక ఉద్యోగం చేయక తప్పలేదు. నిజానికి అప్పటిదాకా.. సినిమాల్లోకి రాకముందు ఆయన ఒక టికెట్ కలెక్టర్ గా పనిచేసేవారట. మళ్ళీ అదే ఉద్యోగంలో చేరి బండి లాక్కొచ్చే ప్రయత్నంలో ఆయనకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
కానీ అలాగే చేస్తున్న సినీ ప్రయత్నాల ఫలితం ఆయనకి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా మొత్తం 300 సినిమాల దాకా చేశారు. ఇక టీవీ సీరియల్స్ ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తి తన 66 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవడం మీడియాలో అతిపెద్ద న్యూస్ గా మారింది. ఆయన ఆత్మహత్యకి పక్కా కారణాలు తెలియలేదు కానీ.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం తేలింది ఏమంటే.. ఆయన చాలా ఒంటరిగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని. 2009 లో ఆయన భార్య చనిపోవడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం.
ఐతే ఆయన ఆత్మహత్య చేసుకోడానికి ముందు ఇంట్లో వాళ్ళతో సూసైడ్ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళట. ఆయనలా మాట్లాడుతున్నారని తెలిసి ఆయన కూతురు నీరజ సైకాలజిస్ట్ ల దగ్గరికి కూడా తీసుకెళ్ళేవాళ్ళట. కానీ, వాళ్ళు ఆయనతో కలిసి ఉండేవాళ్లు కాదు. వాళ్ళు హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా వేరొక ఇంట్లో ఉండటంతో.. రంగనాథ్ గారు ఒక పనిమనిషితో వండించుకుంటూ ఒక్కరే ఉండేవారట. ఆయనకి సేవలు చేసిన పనిమనిషి పేరు మీనాక్షి. ఐతే, ఆయన చనిపోతూ.. గోడ మీద ఒక బ్లాక్ మార్కర్ తో ఆ అమ్మాయికి పలానా ఆస్తి ఇచ్చేయండి.. తనని ఇబ్బంది పెట్టకండి అని రాసారట. ఆయనలా ఎందుకు చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలియాలి. తనని చివరి రోజుల్లో చూసుకున్నది ఆ పనిమనిషి మాత్రమే కాబట్టి అలా చేసి ఉండవచ్చు. లేదా కేవలం ఆస్తి కోసమే చూపిస్తున్న ప్రేమ కాబట్టి.. అది న్యాయంగా తనకి సేవలు చేసిన పనిమనిషికే వెళ్లాలని కూడా ఆయన భావించి ఉండొచ్చు.
Leave a comment