ఫిల్మ్ మేకర్స్ కథని రెడీ చేసుకుని, నటీ నటులని ఎంచుకుని, మ్యూజిక్ అన్నీ చూసుకుని కష్టపడి సినిమా చేస్తారు. అంతవరకు మనకు పబ్లిక్ గా తెలుస్తూనే ఉంటుంది ఐతే అలా తీసిన మూవీ తర్వాత జరిగే వ్యవహారాల గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. సినిమా ఒక్కసారి సిద్ధం అయిన తర్వాత దాన్ని ప్రేక్షకుడికి ఎలా చెరవేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా మన దేశంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ముందుగా మొదటి పద్ధతి చూద్దాం. ఉదాహరణకి మీరొక మూవీ చేశారు. ఆ మూవీకి ఐదు కోట్లు బడ్జెట్ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు ఆ మూవీని ఒక డిస్ట్రిబ్యూటర్ కి అమ్మాల్సి ఉంటుంది. మీ మూవీని కొనే ఆ వ్యక్తికి మీ సినిమా మీద నమ్మకం ఉండి 15 కోట్లకి మూవీ హక్కులని కొనేశాడు అనుకోండి. అంటే.. మీకు 10 కోట్లు లాభం వచ్చినట్లు. కానీ, ఇక్కడ విషయం ఏంటంటే.. రేపు మీరు చేసిన సినిమా బాగా ఆడి 50 కోట్లు సంపాదించింది అనుకోండి.. ఆ డిస్ట్రిబ్యూటర్ కి వచ్చిన 35 కోట్ల లాభం మీద మీకు ఎలాంటి హక్కూ ఉండదు. అలాగే మూవీ బాక్సాఫీస్ వద్ద 10 కోట్లే సంపాదించింది అనుకోండి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ కి 5 కోట్లు నష్టం. అలా జరిగినప్పుడు కూడా ఆ నష్టంపై మీకు ఎలాంటి బాధ్యతా ఉండదు. ఇది ఒక పద్ధతి.
ఇంకో పద్ధతిలో సీన్ కాస్త వేరుగా ఉంటుంది. నిజానికి ఈ రెండో పద్ధతినే ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో ఫిల్మ్ మేకర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్.. లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా సమానంగా పంచుకుంటారు. వాస్తవానికి ఇది కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. మీరు 5 కోట్లు పెట్టి తీసిన సినిమా డిస్ట్రిబ్యూషన్ కి తీసుకెళ్లినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మీ సినిమాని ఒక 500 ల స్క్రీన్ల మీద ప్లే చేస్తాం అన్నారు అనుకుందాం. అప్పుడు మొదటివారంలో వచ్చిన డబ్బులని సమానంగా పంచుకునే అవకాశం ఉంటుంది. అంటే 50-50. తర్వాత రెండో వారంలో వచ్చిన డబ్బులని 60-40, మూడోవారంలో 70-30 ఇలా ఖచ్చితమైన షేర్ ని నిర్ణయించుకుని సినిమాని ప్రేక్షకుడి దగ్గరికి చెరవేస్తారు. అలాగే మూవీకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ కూడా మీ దగ్గరే ఉంటాయి. ఈ పద్ధతిలో ప్రధాన పాత్ర పోషించేది.. సినిమా థియేటర్లలో ఎలా ఆడుతుంది అనేది ఒక్కటే.
ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ లో ఇవి బేసిగ్గా జరిగే రెండు రకాల పద్ధతులు. కానీ, కోట్ల డబ్బు involve అయ్యే ఈ విషయంలో ఎన్నో నియమ నిబంధనలు, ప్రత్యేక చట్టాలు కూడా ఉంటాయి. వాటిన్నిటినీ పరిగణించుకునే ఈ వ్యవహారాలు కొనసాగిస్తుంటారు.
Leave a comment