రాజా రవీంద్ర గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై విలన్‌గా, సహాయక నటుడిగా, కమెడియన్‌గా రాజా రవీంద్ర ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించిన రాజా రవీంద్ర గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.రాజా రవీంద్ర అసలు పేరు రమేష్ దంతులూరి. 1970 సెప్టెంబర్ 19న ఆంధ్ర ప్రదేశ్‌లోని భీమవరంలోని ఓ ఉన్నత కుటుంబంలో రాజా రవీంద్ర జన్మించారు.
ఇక అయన తండ్రి పేరు జయప్రకాష్ రాజు కాగా.. తల్లి పేరు భాస్కరమ్మ. అలాగే రాజా రవీంద్ర పేదనాన్న భూపతిరాజు విజయకుమార్ రాజు ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన ప్రముఖ రాజకీయవేత్త మరియు పారిశ్రామికవేత్త. పశ్చిమ గోదావరి జిల్లా వేండ్ర గ్రామంలో 1975లో స్థాపించబడిన డెల్టా పేపర్ మిల్స్ స్థాపకుడు కూడా.వాస్తవానికి రాజా రవీంద్ర నటుడు కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ, చిన్నతనం నుంచి కూచిపూడి నృత్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఓవైపు చదువుకుంటూ.. మరోవైపు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నారు. అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. బి.కామ్ పూర్తి చేసిన తర్వాత పెదనాన్న డెల్టా పేపర్ మిల్స్ లో మార్కెటింగ్ విభాగంలో కీలకంగా వ్యవరించారు.
కొన్నాళ్లు రాజా రవీంద్ర తన పెదనాన్న వద్దే ఉద్యోగం చేశారు. ఆ తర్వాత పెదనాన్న సలహా మేరకు వెంపటి చిన్నసత్యం గారి వద్ద కూచిపూడి నృత్యంలో మరిన్ని మెళుకవలు నేర్చుకోవడం కోసం రాజా రవీంద్ర మద్రాసు వెళ్లారు. అయితే డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండగా.. ఓ రోజు ఈనాడు లాంటి సినిమాలు తీసిన ప్రముఖ దర్శకుడు సాంబశివరావు గారి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు. అక్కడ రాజా రవీంద్ర పర్సనాలిటీని చూసి.. సినిమాల్లో ట్రై చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారట.
అలాగే తమ డైరెక్టర్ గారిని ఒకసారి కలవమని కూడా చెప్పారట. దాంతో సరదాగానే రాజా రవీంద్ర సాంబశివరావు గారిని కలిసేందుకు వెళ్లగా.. ఆయన ఊహించని విధంగా మృగతృష్ణ అనే సినిమాలో శరత్ బాబుతో కలిసి మరో హీరోగా నటించే అవకాశాన్ని ఇచ్చారు. అలా మృగతృష్ణ మూవీ కోసం రాజా రవీంద్ర మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. దిగువ తరగతి మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి రూపొందిన ఈ చిత్రం 1990లో భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.
కానీ, థియేటర్స్ లోకి మాత్రం త్వరగా రాలేదు. రెండేళ్ల తర్వాత అంటే 1992లో విడుదలై కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. ఈలోపు రాజా రవీంద్ర యముడికి మొగుడు, నేతి చరిత్ర, సర్పయాగం, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, నిప్పు రవ్వ తదితర చిత్రాల్లో సహాయక నటుడిగా చేశారు. అయితే వెండితెరపై సరైన గుర్తింపు మాత్రం ఆయనకు దక్కలేదు. దాంతో రూటు మార్చి బుల్లితెరపై దృష్టి సారించారు. వెండితెరపై అడపా తడపా చిత్రాలు చేస్తూనే.. మరోవైపు అందం, FIR, కృష్ణదాసి, జానకి కలగలేదు వంటి పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.
స్మాల్ స్క్రీన్ పై భారీ ఇమేజ్ సంపాదించుకోవడంతో.. వెండితెరపై కూడా రాజా రవీంద్రకు ప్రధాన్యత ఉన్న పాత్రలు రావడం ప్రారంభం అయ్యాయి. చిరంజీవి, మోహన్ బాబు, రజనీకాంత్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతోనే కాకుండా మహేష్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, శర్వానంద్ వంటి నేటి తరం హీరోలతో కూడా కలిసి పని చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో దాదాపు రెండు వందల చిత్రాల్లో రాజా రవీంద్ర నటించారు. సీరియస్ రోల్స్ తో పాటు కామెడీ రోల్స్‌లోనూ అలరించారు.
రాజా రవీంద్ర 2011లో రవితేజ హీరోగా తెరకెక్కిన మిరపకాయ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అలాగే పలువురు టాలీవుడ్ హీరోలకు రాజా రవీంద్ర చాలా కాలం నుంచి మ్యానేజర్ గా కూడా వర్క్ చేస్తుండటం విశేషం. మొట్టమొదట రవితేజ తన డేట్స్ చూసుకోమని రాజా రవీంద్రను అడిగారు. అలా రవితేజకు మ్యానేజర్ గా మారిన రాజా రవీంద్ర.. ఆ తర్వాత నిఖిల్, రాజ్ తరుణ్, మంచు మనోజ్‌తో సహా పలువురు హీరోలకు డేట్స్ సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. రాజా రవీంద్ర భార్య పేరు వెంకట రమాదేవి. ఈ దంపతులకు ప్రణతి మరియు వాగ్దేవి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. షూటింగ్లో ఏమాత్రం గ్యాప్ దొరికినా రాజా రవీంద్ర హ్యాపీగా తన మనవళ్లు, మనవరాళ్లతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.