Tollywood Flash Strike: కరోనా దెబ్బకి అన్నిరంగాలతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కోట్లాది రూపాయల భారీ నష్టాలను చవిచూసింది. గతకొద్ది రోజులుగా పరిస్థితులు అదుపులోకి రావడంతో యదావిధిగా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పరిణామంలో వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొందరు సినీ కార్మికులు ‘ఫ్లాష్ స్ట్రైక్’ చేపట్టడంతో షూటింగులు నిలిచిపోయాయి.
తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఇలాంటి స్ట్రైకులు చెయ్యడం మంచి పద్ధతి కాదని.. కూర్చుని చర్చించుకుంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చునని.. సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ సినీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేశారు.
నరేష్ మాట్లాడుతూ.. ‘‘యూనియన్స్ తమ వేతనాలు పెంచాలని కోరడం మంచిదే. పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి దీని మీద. కోవిడ్ వల్ల దాదాపు మూడేళ్ల పాటు సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సినీ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఊపిరి పీల్చుకుంటోంది. మన బ్యాంకులు నిండకపోయినా.. కంచాలు నిండుతున్నాయి.. ఇలాంటి టైంలో ‘ఫ్లాష్ స్ట్రైక్’ అనేది బాధాకరం.. కరోనా టైంలో నిర్మాతలు కోట్ల రూపాయలు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు. ఇటువంటప్పుడు తొందరపాటుగా కాకుండా కాస్త టైం తీసుకుని అందరం కలిసి నిర్ణయం తీసుకుంటే మంచిది’’ అన్నారు.
Leave a comment