Venu: బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ఎంతో మంది ప్రతిభని బయటపెట్టింది. ఈ షో వలన చాలా మంది కమెడీయన్స్ పరిచయం అయ్యారు.కొందరు అయితే సినిమాలలో కూడా సత్తా చాటుతున్నారు. అయితే జబర్ధస్త్ మొదట్లో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన వారిలో వేణు ఒకరు. ఆయన రీసెంట్గా బలగం అనే చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద హిట్ కొట్టారు. మానవ సంబంధాలు, వాళ్ల ఎమోషన్స్‌తో దర్శకుడు వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ చిత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. అంతేకాదు ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 100 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో నిర్మాతలు విశ్వ విజయ శతకం వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ..ఇన్నేళ్ల మా కెరీర్లో 50 సినిమాలు తీయగా, ఒక్క చిత్రానికి కూడా అంతర్జాతీయ అవార్డు రాలేదు. కానీ మా వారసులు నిర్మించిన మొదటి సినిమాకే అంతర్జాతీయ అవార్డులు రావడం సంతోషం. నేను వంద రోజుల ఫంక్షన్లు చూశాను. వంద కోట్ల పోస్టర్‌ను చూశాను. కానీ మొదటిసారి ఇలా వంద అవార్డుల ఫంక్షన్‌ను చూస్తున్నాం అంటూ దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప చిత్రాలు తీసే ప్రయత్నం చేస్తూనే ఉంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వేణు మాట్లాడుతూ.. మన మూల్లాలో నుండి రాసుకున్న కథని సహజంగా తీయడం వల్లనే ఇంత పెద్ద హిట్ అయిందని అన్నారు. 2011లో మా నాన్న చనిపోయినప్పుడు సరైన సమయం లేక ఏ ఆచారాలు సరిగ్గా పాటించలేదు. బలగం సినిమా చేసే సమయంలో ఇదే విషయం గుర్తొచ్చి ఆ ఆచారాల గురించి పలువురితో చర్చించి బలగం సినిమా తీసాను అని వేణు స్పష్టం చేశారు.
తెలంగాణలోని సంప్రదాయాలకు భావోద్వేగాలను జోడించి ఒక అందమైన పల్లెటూరి కథగా రూపొందిన బలగం చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, మైమ్ మధు, రూపాలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. దిల్ రాజు సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి వందకు పైగా అంతర్జాతీయ అవార్డులు రావడం అందరం గర్వించదగ్గ విషయం.