తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత డి.రామానాయుడు గారి రెండో కుమారుడు అయిన వెంకటేష్.. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. నిజానికి నటుడు కావాలని వెంకటేష్ ఎప్పుడూ అనుకోలేదు. తన తండ్రి రామానాయుడు మరియు అన్నయ్య సురేష్ బాబు బాటలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావించారు. అలాగే వ్యాపార రంగంలో చక్రం తిప్పాలని ఆశపడ్డారు. అయితే రామానాయుడు గారు మాత్రం వెంకటేష్‌ను నటుడిగా చూడాలని ఆశపడ్డారు. ఆయన కోరిక మేరకు వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు మూవీతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ వెంటనే వరుసగా నాలుగు ఫ్లాపులు పడ్డాయి. అలా అని వెంకటేష్ వెనకడుగు వేయలేదు. 1987లో వచ్చిన శ్రీనివాస కళ్యాణం మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను కొట్టారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
సూర్యవంశం, చంటి, కలిసుందాం రా, సుందరకాండ, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, రాజా, పవిత్రబంధం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, మల్లీశ్వరి, తులసి, నువ్వు నాకు నచ్చావ్, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంక్రాంతి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. విజయాలనే ఇంటి పేరుగా మార్చుకుని విక్టరీ వెంకటేష్ గా ఖ్యాతి పొందారు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఒకటేమిటీ అన్ని వైవిధ్య చిత్రాలతో ఆకట్టుకున్న వెంకటేష్.. తన 38 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో 70కి పైగా సినిమాలు చేశారు. అలాగే బిజీ షెడ్యూల్ వల్లనో, కథ నచ్చకో చాలా సినిమాలను వెంకటేష్ రిజెక్ట్ కూడా చేశారు. ఆ సినిమాలు ఏవి..? అందులో హిట్ అయినవి ఎన్ని ఉన్నాయి..? ఫ్లాప్ అయినవి ఎన్ని ఉన్నాయి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో రోజా ఒకటి. 1992లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓ క్లాసిక్ మూవీని నిలిచింది.
అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ వెంకటేషే. అయితే ఆ సమయంలో తెలుగులో చంటితో సహా పలు సినిమాతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పారు. దాంతో రోజా మూవీలో నటించే ఛాన్స్ అరవింద్ స్వామికి దక్కింది. అంతకు ముందు మణిరత్నంగారే వెంకటేష్,నాగార్జునలతో ఘర్షణ అనే మూవీ చేయాలనుకున్నారు. ఇద్దరికీ స్టోరీ కూడా నెరేట్ చేశారు. అయితే అటు వెంకటేష్, ఇటు నాగార్జున ఇద్దరూ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో.. మణిరత్నం ప్రభు, కార్తీక్ తో ఘర్షణ తీసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే వెంకటేష్ ఈ సినిమాను మిస్ అయినా.. అదే టైటిల్ తో తెలుగులో సినిమా చేయడం విశేషం. కొండపల్లి దశరథ్ డైరెక్టన్ లో నాగార్జున చేసిన సంతోషం మూవీ కూడా వెంకటేష్ వద్దకే వెళ్లింది. అప్పటికే ఆ తరహా కథలు చేసి ఉండటం వల్ల వెంకీ నో అన్నారు. దాంతో ఆ సినిమా నాగార్జున చేసి హిట్ అందుకున్నారు. రానా హీరోగా క్రిష్ తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో మొదట వెంకటేష్‌ను హీరో అనుకున్నారు. కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన రిజెక్ట్ చేశారు. స్టోరీ బాగుండటం వల్ల రానా వెంకీకి బదులుగా నటించారు.
అయితే ఈ చిత్రం అంతగా ఆడలేదు. వెంకటేష్ రిజెక్ట్ చేసిన మరో సూపర్ హిట్ మూవీ క్రాక్. డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్ స్టోరీని వెంకీకి వినిపించాడు. కథ అంతగా కనెక్ట్ కాకపోవడం వల్ల ఆయన తిరస్కరించగా.. రవితేజ అదే స్టోరీతో సినిమా చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. 1999 లో ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు మూవీ సైతం తొలిత వెంకటేష్ వద్దకే వెళ్లింది. కానీ, ఆయన ఆసక్తి చూపకపోవడం వల్ల అర్జున్ సర్జా హీరోగా నటించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. వెంకటేష్ వదులుకున్న చిత్రాల్లో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ కూడా ఉంది. లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న వెంకటేష్ తో కిషోర్ తిరుమల ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని తెరకెక్కించాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ, వీరి కాంబో సెట్ కాలేదు. అదే సినిమాలో శర్వానంద్, రష్మిక నటించగా..వారికి ఫ్లాప్ పడింది. అలాగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో న్యాచురల్ స్టార్ నాని, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చిన జెర్సీ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్‌కు ఫస్ట్ ఛాయిస్ వెంకటేషే కాగా.. ఎంతకో ఆయన మక్కువ చూపలేదు. దాంతో జెర్సీ లో నటించే అవకాశం నానికి దక్కింది. మొత్తంగా వెంకటేష్ రిజెక్ట్ చేసిన వాటిలో మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.