లేడీ అమితాబ్ గా కూడా పేరున్న విజయశాంతికి నేటితో 55 ఏళ్లు. 1966 జూన్ 24 న పుట్టిన ఆమె సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగింది. దాదాపు 190 సినిమాల్లో నటించింది. ప్రధానంగా తెలుగులోనే అయినా తమిళ, కన్నడ సినిమాలోనూ విజయశాంతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నటిగా తనని తాను అన్ని విధాలుగా నిరూపించుకుంది. ముఖ్యంగా ఆక్షన్ సినిమాలకి విజయశాంతి పెట్టింది పేరు. ‘ది యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ గా కూడా అభిమానుల చేత, మీడియా చేత పిలిపించుకుంది అంటే ఆమె ఎంత ప్రత్యేకత సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు.
40 ఏళ్ల తన సినీ కెరీర్ లో ఎన్నో సత్కారాలు పొందారు విజయశాంతి. ఆమె ఖాతాలో పలు అవార్డ్ లు ఉన్నాయి. ‘కర్తవ్యం’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఆవేశాన్ని, స్త్రీ తత్వాన్ని బ్యాలన్స్ చేస్తూ నటించినదుకు గాను ఆమెకి దేశంలోనే ఉత్తమ నటిగా అవార్డు లభించింది. 1985 లో వచ్చిన ప్రతిఘటన సినిమా ద్వారా కూడా తన నట విశ్వరూపం ఏమిటో చూపించింది. ఇంకా నేటి భారతం, అగ్ని పర్వతం, ఛాలెంజ్, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వ గోపాలుడు, యముడికి మొగుడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, ఇంద్రుడు చంద్రుడు వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. ఆమెకి నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు కూడా వచ్చాయి. విజయశాంతి మంచి డాన్సర్ కూడా.
విజయ శాంతి తర్వాత రాజకీయాల్లో కూడా ప్రవేశించి.. నాయకురాలిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. టిఆర్ఎస్ నుంచి ఎంపిగా గెలిచిన ఆమె.. తెలంగాణ ఉద్యమ సంధర్భంగా రాజీనామా చేసి, తెలంగాణ వచ్చిన తర్వాత kcr తో విభేధాల వల్ల పార్టీ నుండి వెళ్లిపోయారు. తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి mla గా కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత చాలాకాలం పాటు ఆక్టివ్ గా ఉండలేదు. తెలంగాణాలో కాంగ్రెస్ తన ప్రభావాన్ని కోల్పోవడంతో.. 90 చివర్లో బీజేపీ కోసం పనిచేసిన అనుభవం ఉన్న ఆమె.. ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలోకే వెళ్లిపోయారు. చివరిగా మహేశబాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు..’ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో విజయ శాంతి కనిపించిన విషయం మనకు తెలిసిందే.
Leave a comment