Bhola Shankar: రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో సందడి చేస్తున్న చిరంజీవి రీసెంట్గా భోళా శంకర్ చిత్రంతో పలకరించాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించగా, కీర్తి సురేష్ .. చిరు చెల్లెలి పాత్రలో కనిపించి సందడి చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్‌గా భోళా శంకర్ చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదలై ప్రేక్షకులని చాలా నిరాశపరచింది. చిరంజీవి కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా భోళా శంకర్ చిత్రం నిలిచింది. తొలి షో నుండే ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ క్రమక్రమంగా తగ్గాయి.
భోళా శంకర్ చిత్రం తొలి రోజు రూ.15 కోట్ల షేర్ వసూలు చేయగా, తర్వాతి రెండు రోజులు అందులో ఐదో వంతు మాత్రమే వసూలు చేసిందంటే ఈ చిత్రం ఎంత దారుణంగా ఆడిందో అర్ధమవుతుంది. ఇప్పుడు అయితే కనీసం కలెక్షన్స్ లేక థియేటర్ రెంట్ కూడా రాని పరిస్థితి ఉందట. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. భోళాశంకర్ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.79 కోట్లు కాగా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి రూ.40 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరచింది. ఇప్పటి వరకు మొత్తం షేర్ కేవలం రూ.25 కోట్లు మాత్రమే రాబట్టగా, బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా రూ.55 కోట్ల దూరంలో ఉంది.
ఇంత డిజాస్టర్‌గా భోళా శంకర్ చిత్రం కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. భోళా శంకర్ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌ని సైతం చాలా పెద్ద దెబ్బ తీసినట్టు టాక్. అయితే సినిమా ఇంత ఫ్లాప్ కావడానికి కారణం ఎవరని కూడా ఇప్పుడు నెటిజన్స్ విశ్లేషిస్తున్నారు. సినిమా ఫెయిల్యూర్ విషయంలో మెహర్ రమేష్ కన్నా చిరంజీవిదే తప్పు అని చాలా మంది అంటున్నారు. ఒక రీమేక్ సినిమా తీసేటప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా చిరంజీవి చాలా లైట్ తీసుకున్నారని అంటున్నారు.చిరంజీవి అంతటి వాడు జబర్ధస్త్ గ్యాంగ్ తో కలిసి చీప్ కామెడీ చేయడమేంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ మధ్య కాలంలో హిట్ లేని మెహర్ రమేష్‌తో సినిమా ఎలా ఒప్పుకున్నాడని కూడా మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.